Pebberu Accident Today: ఆటోను ఢీకొట్టిన కారు.. 11 మంది కూలీలకు గాయాలు - Labor auto accident at Pebberu
10:16 December 27
Pebberu Accident Today: ఆటోను ఢీకొట్టిన కారు.. 11 మంది కూలీలకు గాయాలు
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. వ్యవసాయ పనులున్నప్పుడే కొద్దోగొప్పో కూడబెట్టుకుంటారు. తెల్లవారుజామున వెళ్తే సాయంత్రానికి ఇంటికొస్తారు. పని ఉన్న రోజుల్లో క్షణం తీరికలేని బతుకులు వాళ్లవి. అలా పత్తి ఏరడానికి ఆటోలో వేరే ఊరు వెళ్తుండగా అనుకోని ప్రమాదం. ఏకంగా 11 మందిని తీవ్రంగా గాయపరిచింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి 15 మంది కూలీలు పత్తి తీసేందుకు ఇటిక్యాల మండలం షేక్పల్లి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా పెబ్బేరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఈ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెద్యులు తెలిపారు.
తెల్లారిలేస్తే కూలీ చేసుకుని బతికే వాళ్లని ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ కొట్టింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇంట్లో ఉన్నవాళ్లంతా పని చేస్తే గాని పొట్టనిండదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఎవరి ముందు చేయిచాచక వారి కష్టం మీద బతుకున్న వాళ్లని ఈ ప్రమాదం చీకట్లోకి నెట్టేసింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.