Road Accident in Krishna district: మితిమీరిన వేగం.. నిద్రమత్తు.. ఐదుగురి ప్రాణాలను బలిగొంది. చిన్నారి అన్నప్రాసం కోసం బయల్దేరిన ఆ కుటుంబం అనంతలోకాలకు చేరింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద.. కల్వర్టును కారు వేగంగా ఢీకొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మున్సిపల్ ఉద్యోగి కుటుంబ సభ్యులు ఐదుగురు చనిపోయారు.
నిద్రమత్తులో కల్వర్టును ఢీకొన్న కారు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గౌరవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన కొర్రపాటి కుటుంబరావు.. తన ఆరునెలల మనవరాలు(కుమార్తె కూతురు) ప్రిన్సీ అన్నప్రాసనం కోసం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు కారులో బయలుదేరారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో వీరు ఇంటి నుంచి కారులో వెళ్తున్నారు. కుటుంబరావు, ఆయన భార్య మేరీతో పాటు, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న కుమారుడు జోషి, కోడలు, కుమార్తె, మనవరాలు కారులో ప్రయాణిస్తున్నారు. జోషి కారు డ్రైవింగ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద నిద్రమత్తులో కల్వర్టును ఢీకొట్టారు. ప్రమాదంలో కారు ముందుబాగం దెబ్బతింది. ఘటనాస్థలంలోనే ఇంటిపెద్ద కుటుంబరావుతోపాటు కుమార్తె, కోడలు చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన.. కుటుంబరావు భార్య, కుమారుడు, మనవరాలిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"హైదరాబాద్ శేరిలింగంపల్లిలో నివసించే కుటుంబరావు.. తన కుమార్తె కూతురు అన్నప్రాసన కోసం హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడేనికి వెళ్తున్నారు. రాత్రి సమయంలో కారులో కుటుంబసభ్యులు బయలుదేరారు. మితిమీరిన వేగం, నిద్రమత్తులోనే ఈ ఘటన జరిగినట్లుగా జోషి చెప్పారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు చనిపోగా.. పాప, కుటుంబరావు భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం." -పోలీసులు