ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గుంతపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Car Accident) జరిగింది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో దంపతులతో పాటు కుమార్తె మృతి చెందింది.
కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా ఉప్పలనాయకనహళ్లికి చెందిన సురేశ్ (40) గీతా(31) దంపతులకు పల్లవి(8), పవిత్ర (6) కుమార్తెలు. సురేశ్ బెంగళూరులో కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. పుట్టపర్తి మండలం పెడబల్లలో బంధువులను కలవడానికి సురేశ్ కుటుంబంతో సహా వెళ్లాడు.
సాయంత్రం.. బెంగళూరు తిరిగి వెళ్లడానికి పెడబల్లి నుంచి బయలుదేరారు. పెడబలి నుంచి గుమ్మయ్య గారిపలి కూడలి వరకు సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించారు. అంతలో వెనక్కి రావాలని గురువారం ఉదయం వెళ్లవచ్చని బంధువుల ఇంటి నుంచి పిలుపు రావటంతో వాహనాన్ని వెనక్కి మళ్లించి రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అతివేగంగా వెళ్తున్న కారు పంక్చర్ కావటంతో అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టి(Car Accident) ఉంటుందని కొందరు భావించగా.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పిందని మరికొందరు అంటున్నారు.
ఈ ప్రమాదం(Car Accident) ఎలా జరిగిందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వాహనంలో ఉన్న నలుగురు అందులోనే ఇరుక్కుపోయారు. ఘటనాస్థలిలోనే దంపతులిద్దరూ మృతి చెందారు. కారు లోపల ఇరుక్కుపోయిన పిల్లలను పోలీసులు, స్థానికులు అతి కష్టంమీద ట్రాక్టర్ సాయంతో బయటకు తీసి గోరంట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పల్లవి మృతి చెందింది. పవిత్ర పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో హిందూపురం తరలించారు. బంధువుల ఇంటిలో ఎంతో ఆనందంగా గడిపిన కొన్ని నిమిషాల్లోనే ఇంతటి దుర్ఘటన జరగటంతో పెడబల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.