తెలంగాణ

telangana

ETV Bharat / crime

Machareddy Accident Today : కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి - Kamareddy accident

Machareddy Accident Today
Machareddy Accident Today

By

Published : Mar 28, 2022, 10:16 AM IST

Updated : Mar 28, 2022, 3:01 PM IST

10:13 March 28

మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మృతులు

Machareddy Accident Today : దైవ దర్శనానికి బయల్దేరిన ఓ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆర్టీసీ బస్సు.. కారును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా... మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీకి చెందిన రాధాకృష్ణమాచారి కుటుంబం... ఈరోజు ఉదయం వేములవాడ రాజన్న దర్శనం కోసం అద్దె కారులో బయల్దేరింది.

నుజ్జునుజ్జయిన కారు...

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ ఎక్స్‌రోడ్ సమీపంలో మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు.. వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కరీంనగర్-1 డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వైపు వెళ్తుండగా.. కారు వేములవాడ వైపు వెళ్తోంది. ప్రమాద ధాటికి బస్సు టైరు పేలింది. కారు నుజ్జునుజ్జయింది. కారులో నుంచి రెండు మృతదేహాలు ఎగిరి బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ నరేందర్ మృతదేహం కారులో ఇరుక్కుపోయింది.

అక్కడికక్కడే మృతి...

మరో బాలుడికి తీవ్ర గాయాలు కాగా.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్ పట్టణానికి చెందిన రాధాకృష్ణమాచారి‌(49), అతని భార్య కల్పన(37), కుమారులు శ్రీరామ్, రాఘవ, తల్లి సువర్ణ(70)లతో కలిసి వేములవాడకు బయల్దేరారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా... రాఘవ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నరేందర్ సైతం మృతి చెందారు. ఘటన స్థలాన్ని ఎస్పీ శ్రీనివాసరెడ్డి, రవాణాశాఖ అధికారులు పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను గ్యాస్ కట్టర్‌లు ఉపయోగించి బయటకు తీశారు.

అతివేగమే కారణం...

ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. మూల మలుపు వద్ద అదుపు తప్పి కారును ఢీకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో నిజామాబాద్‌లోని బ్యాంక్ కాలనీలో విషాదం నెలకొంది.

Last Updated : Mar 28, 2022, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details