ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. శృంగవరపుకోట నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు.. ధర్మవరం దగ్గరకు రాగానే.. డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. అదుపు తప్పిన బస్సు రోడ్డుపై నడుస్తున్న ఏడో తరగతి విద్యార్థిని ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంటిలోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటి యజమానురాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యార్థి మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని వెల్లడించారు. అనంతరం డ్రైవర్ ఆర్జీ నాయుడును సుంగరపాడు ప్రాంతీయ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇతనికి గతంలో విధుల్లో ఉండగా ఫిట్స్ రావడంతో అతన్ని నేరుగా ఆసుపత్రి తీసుకువచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.