సూటుకేసులో మృతదేహాన్ని తెచ్చి తిరుపతి రుయా ఆసుపత్రి(RUIA CASE) ఆవరణలో మహిళను తగులబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. భర్తే.. భార్యని హత్య చేసి కాల్చేసినట్లు పోలీసులు తేల్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని, శ్రీకాంత్‌రెడ్డిలు రెండున్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువనేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో మూడు నెలల క్రితం భర్తతో కలిసి తిరుపతి వచ్చి నివాసం ఉంటున్నారు.
భార్యపై అనుమానంతో..
భువనేశ్వరిపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్‌రెడ్డి ఈనెల 23న ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత.. ఆమె కరోనాతో చనిపోయిందని, ఆసుపత్రి యాజమాన్యమే అంత్యక్రియలు నిర్వహించిందని భువనేశ్వరి కుటుంబసభ్యులను నమ్మించాడు. దీనిపై అనుమానం వచ్చిన భువనేశ్వరి బంధువైన ఓ పోలీస్ అధికారి.. తిరుపతి పోలీసులతో కలిసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కూపీ లాగితే విషయం బయటకొచ్చింది..
అపార్ట్‌మెంట్ సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా.. శ్రీకాంత్‌రెడ్డి కొత్త సూట్‌కేసు లోపలికి తీసుకురావడం, కొద్దిసేపటి తర్వాత బయటకు తీసుకెళ్లడం దృశ్యాల ఆధారంగా కూపీ లాగారు. నిందితుడికి సహకరించిన టాక్సీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు.