B.Tech Student Suicide : రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన ఈరంకి శరత్‌వంశీ గౌడ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. తెరాస కార్పొరేటర్, అతని సోదరుడు దాడి చేయడంతో అవమానం భరించలేకనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తండ్రి నరసింహాగౌడ్ ఆరోపించారు.
‘నేను మామిడిపల్లిలో నీటి ట్యాంకర్ల వ్యాపారం చేస్తుంటా. నెల రోజు కిందట ఓ రాత్రి బోరు వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అక్కడకు వెళ్లి చరవాణి లైటుతో దాన్ని పరిశీలించా. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, చదును చేస్తున్న స్థానిక తెరాస కార్పొరేటర్ సుక్క శివకుమార్, అతని సోదరుడు శ్రీకాంత్ నా వద్దకు వచ్చి ‘వీడియో తీస్తున్నావా’ అంటూ దాడికి యత్నించారు. విషయం నా కుమారుడు శరత్‌వంశీగౌడ్‌కు తెలియడంతో కార్పొరేటర్‌ను ప్రశ్నించగా వివాదం చోటుచేసుకుంది. దాంతో కార్పొరేటర్ అతని సోదరుల నుంచి ప్రాణభయం ఉందని అదేరోజు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు పట్టించుకోలేదు. మే 27న మా కుమారుడిపై కార్పొరేటర్ సోదరుడు మళ్లీ దాడిచేశారు. ఈ అవమాన భారంతోనే బుధవారం రాత్రి తన గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం గుర్తించాం’ అని మృతుడి తండ్రి వాపోయారు. అయితే.. దాడుల ఘటనలపై తమకెలాంటి ఫిర్యాదు రాలేదని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.