Brutal murder: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ హత్య కలకలం సృష్టించింది. వ్యక్తిని చంపి.. తల, మొండెం వేర్వేరు చేసి.. వేర్వేరు మండలాల్లో పడేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెల తండాకు చెందిన కడవత్ రాజు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. మూడు రోజుల క్రితం(జనవరి 26) రాజుకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఇక అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ గాలించినా రాజు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
అదృశ్యమైన మూడు రోజులకు..
చేసేదేమీ లేక అదే రోజు(26న) రాజు సోదరుడు గోపాల్.. భానూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈరోజు(జనవరి29) రాజు తల రాయికోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుసునూరు వాగులో దొరికింది. మొండెం మానూర్ మండల పరిధిలో సింగూర్ బ్యాక్‌వాటర్‌లో గాలించగా లభ్యమైంది. రెండింటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.
పలు అనుమానాలు..
ఈ హత్య ఇదే తండాకు చెందిన ఓ వ్యక్తి కిరాయి వ్యక్తులతో చేయించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. రాజకీయంగా.. డబ్బుపరంగా ఎదుగుతున్నాడన్న అక్కసుతోనే ఈ హత్య చేయించినట్లుగా కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసు వివరాలు సేకరించి.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: