వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపేట్లో దారుణం చోటుచేసుకుంది. వేల్పుల సమ్మయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
ఉదయపు నడక కోసం గ్రామ శివారులోకి వెళ్లిన సమ్మయ్యపై దుండగులు గొడ్డలితో దాడి చేశారు. తల భాగంలో విచక్షణారహితంగా నరికి.. ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న సమ్మయ్యను చూసి బోరున విలపించారు.