రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం(Road accident news today) చోటుచేసుకుంది. కొత్తూరు పరిధిలోని తిమ్మాపూర్ శివారులో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్... హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నారు. వనపర్తి జిల్లాలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోదరి మమతతో కలిసి వెళ్లిన చంద్రశేఖర్.... తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తూరు మీదుగా బైక్‌పై వేగంగా వస్తూ... పెట్రోల్ బంక్‌లోకి వెళ్తున్న లారీ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో యువతీయువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివాహానికి వెళ్లి వస్తూ.. విగతజీవులుగా మారిన అన్నాచెల్లెలిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివాహానికి వెళ్లి వస్తుండగా..
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జటారం చంద్రశేఖర్ (25), అతడి సోదరి నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన మద్దూరు మమత (24)... ఇరు కుటుంబసభ్యులు జీవనోపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. జీడిమెట్ల పీటీవో పరిశ్రమలో పని చేస్తున్నారు. కాగా వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో బంధువుల వివాహానికి హాజరై ద్విచక్రవాహనంపై హైదరాబాద్కు వెళ్తుండగా... కొత్తూరు గ్రామం దాటిన తర్వాత ఉన్న పెట్రోల్ బంక్‌లోకి లారీ వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనం వేగంగా వచ్చి లారీని ఢీకొంది. ఇద్దరూ లారీ టైర్ కింద పడిపోయారు. లారీ వారిపైనుంచి వెళ్లడంతో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.