పేదలకు ఉచితంగా కట్టిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల (Double Bed Room House ) పథకానికి స్థానిక నాయకులు తూట్లు పొడుస్తున్నారు. స్థలాల కొరతను సాకుగా తీసుకుని, వారు దళారుల అవతారమెత్తారు. కొన్నిచోట్ల పేదల నుంచి సొమ్ము వసూలు చేసి, స్థలాలు కొనుగోలు చేయిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇళ్లు (Double Bed Room House ) ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల స్థలాల పేరిట రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సేకరించారు. సిరిసిల్లలో ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో లబ్ధిదారుల నుంచి రూ.లక్ష - 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
- సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో సిరిసిల్ల పట్టణ నిరుపేదల కోసం 1,320 ఇళ్లను (Double Bed Room House ) నిర్మించారు. లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారింది. స్థానిక నాయకులు ఒక్కొక్కరు 100-200 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులొచ్చాయి.
- సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌కు 2016లో 15 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ స్థలం లేదు. స్థానిక నాయకుల సూచనతో 15 మంది రూ.50-60 వేల చొప్పున ఇవ్వగా, ఆ డబ్బుతో కొన్న ఎకరం 6 గుంటల భూమిని ఓ నాయకుడు తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇళ్లు (Double Bed Room House ) కట్టకపోవడంతో డబ్బులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది.
- ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో రెండు పడకగదుల ఇళ్ల (Double Bed Room House )కు ప్రభుత్వ భూమి దొరకలేదు. వంద మంది లబ్ధిదారుల నుంచి రూ.20-50 వేల చొప్పున స్థానిక నాయకులు వసూలు చేశారు. ఎకరాకు రూ.7.5 లక్షలు వెచ్చించి అయిదెకరాలు కొన్నారు. రెండేళ్ల కిందటే ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. కారణం.. స్థలానికి డబ్బులిచ్చింది 100 మంది.. కట్టిన ఇళ్లు 70. ఎవరిని తొలగించాలో తేల్చుకోలేక ఇళ్ల(Double Bed Room House )ను వదిలేశారు. భూమికి ఇంకా రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. లేదంటే ఖాళీ స్థలం స్వాధీనం చేసుకుంటానంటున్నారు ఆ భూమి యజమానుల్లో ఒకరైన గణపవరపు శ్రీను. తనకూ ఓ ఇల్లిస్తామంటూ రూ.50 వేలు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపణ.
స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు రాసిచ్చారు
ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నారాయణ, గణపవరపు శ్రీను ముందుకువచ్చారు. స్వచ్ఛందంగా అయిదెకరాలు ఇస్తున్నట్లు కాగితం రాసిచ్చారు. 75 ఇళ్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తయ్యింది.
- పుల్లయ్య, కారేపల్లి తహసీల్దార్
చర్యలు తీసుకుంటాం
అర్హులకే ఇళ్లు (Double Bed Room House ) కేటాయిస్తాం. డబ్బులు వసూలు చేసి భూములు కొనుగోలు చేసే ప్రక్రియ సరైంది కాదు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటాం.