Bridegroom family members attacked on Lady: ప్రేయసి కోసం ప్రేమికుడు విలన్లతో దెబ్బలు తినే సన్నివేశాలు రీల్ లైఫ్‌లో కనబడితే.. ప్రేమించినవాడి కోసం ప్రియురాలి మౌనపోరాటాలు, ప్రియుడి కుటుంబీకులతో దెబ్బలు తినే సన్నివేశాలు రియల్ లైఫ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. మనసిచ్చిన వాడిని నమ్మి సర్వస్వం అర్పించిన యువతికి.. పెళ్లి సమయం దగ్గరికొచ్చేసరికి ప్రేమికుడి నుంచి మొండి చేయే కనిపిస్తుంది. ఇదేంటని నిలదీసి అడిగితే.. అతడి కుటుంబీకుల నుంచి దౌర్జన్యమే తప్ప దిద్దుబాటు చర్యలు కనపడవు. సుపుత్రుడు చేసిన తప్పును సమర్థిస్తారు. కానీ ఆ తప్పు చేసిన వాడికి బలైన యువతికి మాత్రం జీవితాంతం మానసిక వేదనే బహుమతి. తమ ఎనిమిదేళ్ల బంధానికి అలాంటి బహుమతే ఇచ్చాడు ఓ ప్రేమికుడు.
ఎనిమిదేళ్ల ప్రేమ బంధం.. ఆ బంధంలో ఎన్నో మధురానుభూతులు, ఊసులు, ఒకరిపై ఒకరి బాసలు. ఆ పయనంలో ఎప్పటికైనా తనవాడేననుకున్న ఆ యువతి.. తన సర్వస్వాన్నే అర్పించింది. కానీ అవన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయని అనుకోలేదు. నమ్ముకున్న వాడే నట్టేట ముంచుతాడని కలలో కూడా ఊహించలేకపోయింది. ప్రేమించినవాడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేకపోయిన బాధితురాలు.. ఎలాగైనా తన ప్రేమను దక్కించుకోవాలని చూసింది. చివరకు ఆమెకు తీరని అన్యాయమే జరిగింది.
ఓ ఆడదాని మనసు సాటి ఆడదానికే తెలుసంటారు. కానీ ఇక్కడ ఆ బాధితురాలికి మాత్రం చుట్టూ ఉన్న ఆడవాళ్లు సైతం శత్రువులుగా మారారు. ఆమె గోస విని నిజానిజాలు తెలుసుకుని.. సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి మానవత్వం మరిచి ప్రవర్తించారు. అక్కడున్న పోలీసుల మౌనం సైతం వారికి అరాచకానికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో ఇంకా రెచ్చిపోయి జట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి చెప్పులతో కొట్టారు. తన బాధను కూడా చెప్పుకొనే అవకాశమివ్వలేదు. ఇదంతా చూస్తున్న మన కథానాయకుడు మాత్రం.. దీంతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తన పనిలో తాను లీనమైపోయాడు.
ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహాన్ని మహబూబాద్ జిల్లా గార్లకు చెందిన బాధితురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించింది. గార్ల ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ తనను ఎనిమిదేళ్లుగా ప్రేమించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. పెళ్లి విషయం మాట్లాడిన ప్రతిసారీ దాటవేసి.. ఇప్పుడు ఖమ్మం వచ్చి రహస్యంగా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని యువతి ఆరోపించింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న యువతి.. కల్యాణ వేదిక లోపలికి వెళ్లి పెళ్లి ఆపబోతుండగా.. అక్కడున్న యువకుడి బంధువులు ఆమెను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని ప్రతిఘటించి లోపలికి వెళ్లబోతుండగా.. ఆమెను అడ్డుకుని కిందపడేసి జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. 'నీ కొడుకు నన్ను ప్రేమించి మోసం చేశాడు.. న్యాయం చేయండి' అని వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఓ పోలీసు అధికారి మాత్రం కనీసం ఆమెపై దాడిని ఆపేందుకు యత్నించలేదు. యువకుడి బంధువులు సైతం పోలీసు ఉన్నారనే భయం లేకుండా ఆమెపై దాడి చేస్తూనే ఉన్నారు.