పచ్చని తోరణాలతో కళకళలాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదఛాయలు అలముకున్నాయి. అంతవరకు పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. కలకాలం తోడుంటాడనుకున్న భర్త.. మూడుముళ్లేసిన గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారాడు. ఉరి వేసుకొని నవవరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన సూర్యాబాబుకు స్థానిక యువతితో ఆదివారం ఉదయం వైభవంగా వివాహం జరిగింది. ఆ చూడ ముచ్చటైన జంటను చూసి వచ్చిన అతిథులు కలకాలం కలిసి ఉండాలంటూ ఆశీర్వదించి వెళ్లారు.
తమ కుమార్తె ఓ ఇంటికి చేరిందని వదువు తల్లిదండ్రులు సంబురపడ్డారు. తన దాంపత్య జీవితం సుఖంగా గడిచిపోవాలనే ఆకాంక్షతో మెట్టినింట నవవధువు అడుగెట్టింది. అయితే ఆ సంబురాలు, ఆశలు.. తెల్లారేసరికే అడియాసలయ్యాయి.