జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం సింగపూర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్పల్లికి చెందిన పెద్దగొండ ప్రవీణ్, సౌమ్య... గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ నెల 4న హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు.. కాసేపటికే రిజిష్టర్ కార్యాలయానికి చేరుకుని వధువును తీసుకెళ్లిపోయారు. వాళ్లను ఆపలేకపోయిన ప్రవీణ్.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాలను పిలిపించిన పోలీసులు.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత సముదాయించినా.. అమ్మాయి తరఫువాళ్లు రాజీపడలేదు. అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు.
అమ్మాయి మళ్ళీ అబ్బాయికి ఫోన్ చేసి తనను తీసుకెళ్లమని కోరగా... సౌమ్యను ప్రవీణ్ తన ఇంటికీ తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సౌమ్య కుటుంబసభ్యులు... కోపంతో ఊగిపోతూ ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. బండరాళ్లు, కర్రలు, గొడ్డలిలాంటి మారణాయుధాలతో దాడి చేయగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు.