చాలామంది అమ్మాయిలు తెలిసీ తెలియని దశలో, కౌమార వయసులో ఆకర్షణలకు లోనవుతున్నారు. అవతలి వ్యక్తి మనస్తత్వం, ప్రవర్తనపై సరైన అంచనా, అవగాహన లేకుండానే వారి వలలో చిక్కుకుంటున్నారు. యువకులు మొదట్లో సున్నితంగా ఉంటూ, మంచి మాటలతో అమ్మాయిలతో చనువు పెంచుకుంటున్నారు. కొన్నాళ్లకు వారి ముసుగు తొలగి అసలు స్వభావం బయటపడే కొద్దీ.. అమ్మాయిలు నెమ్మదిగా దూరం పెడుతున్నారు. మంచీచెడులు అర్థం చేసుకునే పరిణితి రావడం, కెరీర్‌పై దృష్టి సారించే క్రమంలో వారి ఉచ్చులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలోనే యువకుల్లోని విపరీతగుణం వెలుగుచూస్తోంది. అప్పటివరకూ తనతో బాగా మెలిగిన అమ్మాయి దూరం పెడుతుండటంతో.. కక్ష పెంచుకుంటున్నారు. ఇతరులతో చనువుగా ఉంటుందేమోనని అపోహ పడుతున్నారు. పగతో రగిలిపోతూ వేధింపులకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. చంపేయాలన్నంత కసి పెంచుకుంటున్నారు. తాను మారిపోయానంటూ, చివరిసారి మాట్లాడేందుకు బయటకు రావాలంటూ నమ్మిస్తున్నారు. తమ మధ్య సంబంధాలు బాగా ఉన్నప్పటి ఫోన్ సంభాషణలు, తీసుకున్న చిత్రాలు భద్రపరుచుకుని.. తాను పిలిచిన చోటుకు రాకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరిస్తున్నారు. పరువు, భయంతో బయటకొచ్చిన యువతిని.. చివరకు ఘర్షణకు దిగి చంపేస్తున్నారు.
ఆ ఆలోచనే వారికి అలుసవుతోంది...
ప్రేమోన్మాదుల వేధింపుల సమస్యను తొలుత వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనను అవతలి వారు అలుసుగా తీసుకుంటున్నారు. అమ్మాయి భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందనో.. పరువు పోతుందనో.. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు వెనకాడుతున్నారు. దీంతో తమను ఏమీ చేయలేరులే అనే భావనతో అవతలి వారు రెచ్చిపోతున్నారు. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి సత్వర స్పందన లోపిస్తోంది. ఇటీవలి ఉదంతాలే ఇందుకు తార్కాణాలు.
4 నెలలు.. 7 ఉదంతాలు
1. చిత్తూరు జిల్లాలో గాయత్రి అనే యువతిని ఢిల్లీబాబు అనే యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిరువురూ నెలన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు. పెద్దలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడికి పెళ్లి వయసు రాకపోవటంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. ఆ తర్వాత నుంచి గాయత్రి మనసు మార్చుకుని తనను దూరం పెడుతోందని.. ఆమె తల్లిదండ్రుల మాటే వింటూ.. తనను తిరస్కరిస్తోందని భావించిన ఢిల్లీబాబు పగ పెంచుకుని ఉన్మాదిగా మారాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. చివరికి అతనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
2. విజయవాడలో దారుణ హత్యకు గురైన ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినికి నాగేంద్రబాబు నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అతని వల్ల తన కుటుంబ సభ్యులకు ఏమైనా హాని కలుగుతుందేమోనన్న భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చివరకు ఆ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి గొంతు కోసి చంపేశాడు. తానూ కత్తితో గాయపరుచుకున్నాడు.
3. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో సజీవ దహనమైంది. యువకుడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరోసారి ఆమె జోలికి వెళ్లనంటూ రాసిచ్చాడు. తర్వాత కొద్దిరోజుల్లోనే చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఆ మంటల్లో తానూ మరణించాడు.
4. విశాఖ జిల్లా గాజువాకలో అఖిల్‌సాయి అనే యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడంటూ యువతి తండ్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి భవిష్యత్తు పాడైపోతుందంటూ నిందితుడి తండ్రి యువతి తండ్రిని బతిమాలాడు. మీ కుమార్తె జోలికి రాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వటంతో యువతి తండ్రి ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అయినా ఆ ప్రేమోన్మాది ఆమె గొంతుకోసి హతమార్చాడు.