PUBG Addiction: శారీరక దారుఢ్యానికి మేలు చేయాల్సిన ఆటలు.. ఊబకాయానికి బాటలు వేస్తున్నాయి! మానసిక ఉల్లాసానికి దోహదం చేయాల్సిన గేమ్స్.. మానసిక వైఫల్యానికి బాటలు వేస్తున్నాయి! విశాలమైన మైదానాల్లో పది మంది కలిసి ఉత్సాహంగా ఆడాల్సిన ఆటలను.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా సెల్ ఫోన్లలో ఆడేస్తున్నారు. కోచ్ అవసరం లేదు.. ఫిజియోతో పనే లేదు.. తోడుగా సహచరుడు కూడా కనిపించడు. రాక్షస చిత్రాల మాటున సాగిపోయే ఈ దారుణ క్రీడలో.. అంతిమ విజేతలెవ్వరూ ఉండకపోవడమే మొబైల్ గేమ్‌లోని అసలు ట్విస్ట్! ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. పబ్జీ గేమ్‌లో ఓడిపోయాడంటూ స్నేహితులు హేళన చేయడంతో.. దాన్ని జీర్ణించుకోలేక ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే.. ఈసారి గేమ్‌లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే ఈ సమాజంలో.. ఓడిపోయిన వాడికి చోటే లేదని భావించాడు ఆ బాలుడు..! భ్రమకు, వాస్తవానికి తేడా తెలియని వయసులో.. ఓటమి బాధను జీర్ణించుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.