Investment Fraud In Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ యంత్రాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో పట్టుకున్నట్లు వెల్లడించారు. దీపం వత్తుల యంత్రాలు, బొట్టు బిళ్లల యంత్రాలు కొనుగోలు చేస్తే ముడిసరుకు తామే ఇస్తామని.. తయారు చేసిన వాటిని అధిక ధరకు కొనుగోలు చేస్తామని బాధితులకు తెలిపాడు.
మొదట కొన్ని రోజులు డబ్బు చెల్లించిన అనంతరం, స్పందించకపోవడంతో.. రెండు రోజుల క్రితం బాధితులు సంస్థ కార్యాలయానికి చేరుకుని నిలదీశారు. దీంతో రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. మోసం పోయామని గ్రహించిన బాధితులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నారు.
అసలేం జరిగిదంటే: హైదరాబాద్ ఏఎస్. రావునగర్‌లో ఆర్ఆర్. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఓ కార్యాలయాన్ని తెరిచాడు. ఇంటి వద్దనే ఉండి, నెలకు 30 వేలు సంపాదించే అవకాశమంటూ.. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చాడు. వీటిని చూసిన పలువురు ఆయనని సంప్రదించారు. ఇలా తన వద్దకొచ్చిన వారికి.. తమ వద్ద దీపం ఒత్తులు తయారు చేసే యంత్రం, బొట్టుబిళ్లల యంత్రం తీసుకుంటే.. ముడి సరుకును తామే ఇచ్చి, తయారు చేసిన వాటిని కొంటామని నమ్మబలికాడు.
మూడేళ్ల పాటు ఒప్పందం:గతంలో తాను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పటంతో నమ్మి, సంప్రదించిన వారంతా వరుసగా యంత్రాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇలా రూ. 2లక్షల 80వేలకు బొట్టుబిళ్లల తయారి యంత్రం, లక్షా 80వేలకు దీపం వత్తుల తయారుచేసే యంత్రాన్ని విక్రయించాడు. యంత్రాలు కొన్నవారితో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న రమేశ్.. రూ. 250కు కిలో దూదిని కస్టమర్లకు అమ్మి.. వారి నుంచి కిలో ఒత్తులను 550కి కొంటున్నాడు.