భూ దందాలు, సెటిల్‌మెంట్లు, తగాదాలు, ఆధిపత్య పోరు, పంపకాల్లో తేడాలు కారణాలేవైతేనేం... రౌడీషీటర్లు విజృంభిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకర్నొకరు హతమార్చుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఇతరులనూ అంతం చేస్తున్నారు. కొన్ని నెలలుగా గుంటూరు, విశాఖ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ఇలాంటి హత్యలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనధికారిక దందాల నేపథ్యంలో రౌడీముఠాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తొలుత ఎవరో ఒకరు దూకుడుగా వ్యవహరించి అవతలి ముఠాలోని సభ్యుల్ని అంతం చేస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడు వాళ్లు సైతం ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరులలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ల హత్యలు ఈ కోవలోనివే. గుంటూరు గుజ్జనగుండ్ల పార్కు సెంటర్‌లో రెండు రోజుల కిందట అందరూ చూస్తుండగానే అంగళకుర్తి మంగరాజు అనే రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు హతమార్చారు. నెల రోజుల కిందట ఓ వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో మంగరాజు, ఆయన కుమారుడు నిందితులుగా ఉన్నారు. నెల రోజుల కిందట విశాఖపట్నం తోటగరువు ప్రాంతంలో అప్పలరాజు అనే వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కొంతమంది కత్తులతో దాడి చేశారు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసులో అప్పలరాజు నిందితుడు. ఈ కేసు నిందితుల్లో ఇప్పటికే ముగ్గురు హతమవడం గమనార్హం.
* విశాఖపట్నంలో నెల రోజుల కిందట సన్నా వెంకట్‌రెడ్డి అలియాస్ బండరెడ్డి అనే రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. అతడు రెండు హత్య కేసుల్లో నిందితుడు.
* తిరుపతిలో 2019 డిసెంబరులో బెల్ట్ మురళి అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడైన దినేష్‌ని 2020 సెప్టెంబరులో హతమార్చారు. నెల్లూరులో గవాస్కర్ తేజ అనే రౌడీషీటర్‌ను గతేడాది జులైలో అతని ప్రత్యర్థులు చంపేశారు.
దందాల కోసం.. అనధికారిక సామ్రాజ్యాలు అనధికారిక దందాల కోసం నగరాల్లోని వివిధ ప్రాంతాలను రౌడీషీటర్లు పంచుకుంటున్నారు. వేరే ముఠావాళ్లు అక్కడ పంచాయితీలు చేసినా, ఎదురుతిరిగినా ఘర్షణలు జరుగుతున్నాయి.
* నేరాల ద్వారా సంపాదించిన అక్రమ సొత్తు పంపిణీలో విభేదాలు, ఒక ముఠా చేసే కార్యకలాపాలను మరో ముఠా అడ్డుకునే క్రమంలోనూ హత్యలు పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కారణంగానూ వివాదాలు రాజుకుంటున్నాయి.