తెలంగాణ

telangana

ETV Bharat / crime

నమ్మినవాళ్లు మోసం చేశారని.. బీజేపీ నేత ఆత్మహత్య - వరంగల్‌లో బీజేపీ నేత ఆత్మహత్య న్యూస్

BJP Leader suicide in Warangal : ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓటమి బాధ ఓవైపు వెంటాడుతోంటే.. మరోవైపు అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఇంకోవైపు నమ్మి డబ్బు ఇచ్చిన వాళ్లు మోసం చేశారు. ఇదంతా తట్టుకోలేక మనస్తాపం చెందిన ఓ బీజేపీ నాయకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది.

suicide
suicide

By

Published : Feb 6, 2023, 9:15 AM IST

BJP Leader suicide in Warangal : అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ బీజేపీ నేత సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ ఎనుమాముల బాలాజీనగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి(45) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ(వరంగల్‌) ఎన్నికల సమయంలో కార్పొరేటర్‌ టికెట్‌ రాకపోవడంతో తెరాసను వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు.

ఎన్నికల సమయంలో ఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్‌ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నానని, ఓటమి పాలైన తనను ఓ వైపు ఆ బాధ కుంగదీస్తుంటే మరోవైపు మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధించాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. ఆయన ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, నమ్మినవారు తనను మోసం చేశారని విలపించారు. తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ లేఖ రాశారు. వీడియోను మిత్రులకు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఉరేసుకున్నారు.

ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త మృతికి కారకులైన సాంబేశ్వర్‌, ఆయన భార్య ప్రమీల, మరో వ్యక్తి కోట విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి భార్య లక్ష్మి ఎనుమాముల సీఐకి ఫిర్యాదు చేశారు. కుమారస్వామి గతంలో చిన్న పరిశ్రమల విభాగంలో ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details