నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. రాత్రిపూట బైక్‌లను అపహరించి.. వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. బయట పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా రెక్కీ నిర్వహించి.. బైక్‌లను కొట్టేస్తున్నారు.
Theft: ఇందూరులో దొంగల హల్‌చల్... ఖరీదైన బైకులే వారి లక్ష్యం.. - nizamabad district latest news
రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు.. ఖరీదైన బైక్‌లే వారి లక్ష్యం... ఒకడు బైక్ హ్యాండిల్ లాక్ తీస్తాడు.. మరొకడు ఎవరైనా వస్తున్నారా అని నిఘా వేస్తాడు. ఇంతలో ఓ ఆటో వస్తోంది. అదును చూసి... బైక్‌ను అక్కడి నుంచి తరలిస్తారు. ఇది నిజామాబాద్‌లో బైక్ దొంగల ముఠా స్టైల్. తాజాగా ఇలాంటి చోరీయే అక్కడ జరిగింది. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్టయ్యాయి.
తాజాగా మంగళవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్‌రోడ్‌లో ఓ ఆసుపత్రి వద్ద రూ.2లక్షల విలువైన పల్సర్‌ను అపహరించారు. డిచ్‌పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ప్రశాంత్.. తన తమ్ముడి వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి.. లోపలికి వెళ్లారు. రాత్రంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. తెల్లవారుజామున బయటకు వచ్చేటప్పటికీ వాహనం కనిపించలేదు. ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే.. ఇద్దరు వ్యక్తులు బైక్‌ను దొంగతనం చేసినట్లు తెలిసింది. బాధితుడు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
ఓ వ్యక్తి బైక్ హ్యాండిల్ లాక్ తొలగించి.. దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. మరో వ్యక్తి.. ఎవరైనా వస్తున్నారేమోనని నిఘా ఉంచాడు. ద్విచక్రవాహనం రోడ్డు మీదకు తీసుకురాగానే ఆటో వచ్చి ఆగుతుంది. దాని సాయంతో బైక్‌ను అక్కడి నుంచి తరలించారు. కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ చోరీ చేసిన వాహనాలను పక్కనే ఉన్న మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.