ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముఠా (Gang of thieves) సభ్యులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే లారీతో పాటు 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంచిర్యాలకు చెందిన పాత నేరస్థులు మహబూబ్, రవి, మరో బాల నేరస్థుడు ముగ్గురు కలిసి మెకానిక్ పని చేస్తూ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు.
ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించి వచ్చే నగదును సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. లారీతో పాటు 6 లారీ టైర్లు దొంగిలించారని పేర్కొన్నారు. దొంగలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నామని మంచిర్యాల ఏసీపీ వెల్లడించారు. మరో కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ జేబుదొంగను కూడా అరెస్ట్ చేశామని వివరించారు.