వికారాబాద్ జిల్లా పరిగిలో మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక కుర్చీ కోసం మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానలా మారి తలలు పగలగొట్టుకునేవరకు చేరింది. పట్టణంలో హోలి పండుగ మధ్యాహ్నం వరకు సాగింది. అధికారుల ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు సాయంత్రం వరకు మూసి ఉన్నాయి. సాయంత్రం మద్యం దుకాణాలు తెరవటంతోనే మందుబాబులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
పరిగిలోని బహార్పేట్ చౌరస్తాలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగేందుకు రెండు గ్రూపులు వచ్చాయి. రెండు గ్రూపులకు ఓ కుర్చీ అవసరం కాగా.. దాని కోసం చిన్నగా గొడవ మొదలైంది. అది కాస్తా పెద్ద ఘర్షణగా మారి తలలు పగిలేంతవరకు వెళ్లింది. కుర్చీ కోసం మొదలైన తగాద.. మద్యం మత్తులో పెద్దదైంది. ఒక వర్గానికి చెందిన వాళ్లు ఇంకో వర్గం మీద బీరుబాటిళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు.