అమాయకుల ప్రాణాలతో సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. నల్గొండ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బీమా సొమ్ము కోసం అమాయకులను హతమారుస్తున్న కిరాతకుల దారుణాలు అలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దామరచర్ల మండలంలోని రాళ్లవాగు తండకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ఉదంతంలో పాలుపంచుకున్న 17 మంది నిందితులను నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఒక బీమా ఏజెంటును సైతం పోలీసులు అదుపులోకి తీసుకోగా... మరొకరు పరారీలో ఉన్నారు.
తల్లి అనుమానంతో వెలుగులోకి...
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం రోజుల క్రితం నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కుటుంబ సభ్యులకు కోటిరెడ్డి భార్య తెలిపింది. అంతక్రియలు సమయంలో మృతదేహంపై ఉన్న పెద్దపెద్ద గాయాలను గమనించిన అతడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు... తమదైన శైలిలో విచారించారు. పక్క గ్రామానికి చెందిన తన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసమే కోటిరెడ్డి హత్య చేశామని నిందితురాలు అసలు విషయాన్ని వెల్లడించింది. భాగస్వామిగా ఉన్న బీమా ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బీమా ఏజెంట్.... గత మూడేళ్లుగా ఓ ముఠాను ఏర్పాటు చేసి ఈ అకృత్యాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. కొండ్రపోలు గ్రామంలో మరో ముగ్గురిపై కూడా ఇదే తరహా బీమా చేయించినట్టుగా విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు.