Missing case chased: హైదరాబాద్ ఎల్బీనగర్లో ఈ నెల 16 వ తేదీన అదృశ్యమైన తెలంగాణ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భానుచందర్ కథ విషాదాంతమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఖమ్మంలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిపోవడంతో చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా ఆ వ్యక్తి అదృశ్యమైన భానుచందర్‌గా పోలీసులు గుర్తించారు. గత 9 రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీసులకు భానుచందర్ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాయినగర్‌లో ఉన్న పేదలకు గుడిసె స్థలాల పట్టాల కోసం భానుచందర్ నిత్యం పోరాడేవాడని మృతుడి కుటుంబీకులు తెలిపారు. ఆ స్థలంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించిన మరునాడే ఈ సంఘటన జరిగిందని చెప్పారు. దీంతో ఆ స్థలంలో నివసించే పలువురు వ్యక్తులపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు హత్య కోణంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా భానుచందర్‌కి కావ్య అనే యువతితో రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.