Cyber Crime mails: సైబర్ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు... బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా నకిలీ మెయిల్ ఖాతాలతో నైజీరియన్లు చేస్తున్న మోసాలకు... బాధితులు లక్షల రూపాయల నగదు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వాసి నరేందర్‌కు... తన మిత్రుడు నర్సింగ్ నుంచి మెయిల్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లిన తాను దోపిడీకి గురయ్యానని... అత్యవసరంగా లక్ష రూపాయలు పంపాలని ఆ మెయిల్ సారాంశం. వెంటనే నరేందర్.. లక్ష పంపించాడు. రెండు రోజుల తర్వాత మిత్రుడిని కలిస్తే... అతడు బ్యాంకాక్ వెళ్లనేలేదని తెలుసుకుని కంగుతిన్నాడు. ఇదే తరహాలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్య నిపుణుడి నుంచి రూ.5 లక్షలు కాజేశారు. మరో ఐఏఎస్ అధికారి పేరిట నకిలీ మెయిల్ నుంచి... తన మిత్రుడికి లక్షన్నర అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ సందేశం పంపారు. గిఫ్టు కార్డులనగానే అనుమానంతో కాల్ చేసి కనుక్కోగా.... అసలు విషయం తెలిసింది.
ఆపదలో ఉన్నానంటూ..
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు, చిరునామాలను కొనుగోలు చేసినట్లే.... సైబర్ నేరస్థులు మెయిల్ ఖాతాలను డార్క్‌నెట్ ద్వారా కొంటున్నారు. మెట్రోనగరాల్లో నివసిస్తున్న వారిని ఎంపిక చేసుకుని.... వారి పాస్‌వర్డ్‌లతో మెయిల్స్‌ను చూస్తున్నారు. స్నేహితులు, సన్నిహితుల వివరాలను సేకరించి.... వైద్యనిపుణులు, ప్రైవేటు సంస్థల యజమానులను మోసం చేసేందుకు ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఆపదలో ఉన్నానంటూ మిత్రుడిలా మెయిల్ పంపి దోచుకుంటున్నారు.