బెంగళూరులో తాజాగా సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో పట్టుబడిన నిందితులు... వాటిని తాము ఏపీలోని విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నట్లు అక్కడి పోలీసులకు చెప్పడం చర్చనీయమైంది. కడుగొండనహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 27, మార్చి 5వ తేదీల్లో పట్టుబడిన ఈ ముఠాల సభ్యులు... తరచూ విశాఖపట్నం వస్తూ అక్కడే మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తూ.. వాటిని బెంగళూరులోని విద్యార్థులకు సరఫరా చేస్తుంటారని విచారణలో తేలింది. పోలీసులకు పట్టుబడిన వారిలో ముగ్గురు ఆఫ్రికా దేశాలకు చెందిన వారున్నారు. వారిలో ఇద్దరు నైజీరియా వాసులు కావడం గమనార్హం. విశాఖలో ఎవరి వద్ద ఆ మత్తు పదార్థాలను కొనుగోలు చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇదొక్కటే కాదు... కొన్నాళ్లుగా బెంగళూరులో పట్టుబడుతున్న పలువురు మాదకద్రవ్యాల సరఫరాదారులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విశాఖతో సంబంధాలు ఉంటున్నాయి. గతేడాది మార్చి 6న అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. కేఆర్‌పురం పోలీసుస్టేషన్ పరిధిలో 70 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు, ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పట్టుబడిన నలుగురు నిందితుల్ని ప్రశ్నించగా.. వాటిని విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
మూలాల్లోకి వెళ్లి ఆరా ఏదీ?
- విశాఖ నగరంలోనూ ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ గుళికలు, కొకైన్ తదితర మత్తు పదార్థాలు పట్టుబడిన సందర్భాలు గతంలో అనేకం వెలుగుచూశాయి. ఆయా కేసుల్లో పోలీసులు సరఫరాదారుల్ని అరెస్టు చేయగలుగుతున్నారు. వాటి మూలాల్లోకి వెళ్లి లోతుగా పరిశోధన చేయడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు.
- వాటిని సమకూరుస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించలేకపోతున్నారు. నగరంలో సబ్‌డీలర్లుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించలేకపోతున్నారు.
- బెంగళూరు పోలీసులు తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల నుంచి ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అందులోని సమాచారాన్ని విశ్లేషించారు. విశాఖ పోలీసులు ఆ సమాచారాన్ని తెప్పించుకుని ముందుకు సాగితే స్థానిక నెట్‌వర్క్‌ను ఛేదించే వీలుంటుంది.