హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారున్ని వెనుక కూర్చున్న వ్యక్తి... గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఫలక్‌నుమా బస్‌డిపో సమీపంలో జరిగింది. జనసంచారం ఉన్న వీధిలో నుంచి గొంతులో నుంచి రక్తం చిమ్ముతున్న ఓ వాహనదారుడు పరుగెత్తుతూ వచ్చి రోడ్డుపై కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.
Murder: వెనక కూర్చొని.. బండి నడుపుతున్న వ్యక్తి గొంతు కోసేశాడు.!
ప్రేమ పేరుతో కూతురిని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పద్ధతి మార్చుకోకుండా.. ఫోన్లు చేసి విసిగించసాగాడు. కోపం పెంచుకున్న తండ్రి ఆ వ్యక్తిని హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. దానికి ఓ ప్లాన్ వేశాడు. అనుకున్న ప్రకారం.. అందరూ చూస్తుండగానే ప్లాన్ అమలు చేసి హతమార్చాడు. ఈ హత్య దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి.
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా సీఐ దేవేందర్... సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు అన్సారీ రోడ్‌కు చెందిన షారూఫ్గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఫలక్‌నుమా ఏసీపీ ఎంఏ మాజిద్ సందర్శించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య చేసింది... సయ్యద్ అన్వర్‌గా పోలీసులు గుర్తించారు.
కూతురిని వేధిస్తున్నాడనే...
గతేడాది షారూఫ్పై నిందితుడు సయ్యద్ అన్వర్ కేసుపెట్టాడు. తన కూతురిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా... పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటికీ షారూఫ్.. పద్ధతి మార్చుకోకుండా అన్వర్‌కు పదే పదే ఫోన్లు చేసి వేధించసాగాడు. ధ్వేషం పెంచుకున్న సయ్యద్ అన్వర్... ప్లాన్ ప్రకారం మృతుడు షారూఫ్ను పిలిచాడు. షాఅలీ బండ వరకు వెల్దామన్నాడు. ఒప్పుకున్న షారూఫ్... తన ద్విచక్రవాహనంపై తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో వెనకాల కూర్చున్న సయ్యద్... ద్విచక్రవాహనం నడుపుతున్న షారూఫ్ను గొంతు కోసి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.