Fake baba in Parigi: 'మన వాళ్లకు లాజిక్లకంటే మ్యాజిక్లే కావాలి. అందుకే సర్ మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్'... అని ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగును అక్షర సత్యం చేస్తూ.. నిరూపించిన ఘటనలు ఎన్నో.. శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు అందని లాజిక్‌లు సైతం వీరి సొంతం. అందుకే బాబాల దగ్గర జనాల క్యూ మామూలుగా ఉండదు. రూ. వేలు, లక్షలు సైతం ధారపోసి.. తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటారు. అలాగే ఓ యువతి సైతం ఓ బాబా దగ్గరికి వెళ్లింది. చివరికి ఆస్పత్రి పాలైంది. అసలేమైందంటే..
భూత వైద్యుడి నిర్వాకంతో ఓ యువతి ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్‌లో ఓ దొంగ బాబా నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూతవైద్యం పేరుతో దెయ్యాలను వదిలిస్తానని అమాయకులను రూ. లక్షలు దుండుకుంటున్నాడు రఫీ అనే నకిలీ బాబా. ఇటీవల ఓ యువతి(18) ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. తెలిసిన వారి ద్వారా ఓ భూతవైద్యుడిని సంప్రదించారు తల్లిదండ్రులు. తాను చెప్పింది చేస్తే దెయ్యం వదులుతుందని చెప్పిన ఆ దొంగ బాబా.. మొదటగా యువతికి కడియం వేశాడు. ఆ తర్వాత గత శుక్రవారం మళ్లీ బాబా దగ్గరకు వెళ్లారు. యువతికి విబూది రాస్తానని చెప్పిన అతను.. ఆ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టించాడు. దీంతో సదరు యువతి రెండు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఊహించని పరిణామానికి తల్లిదండ్రులు లబోదిబోమంటూ.. తమ కూతురిని వికారాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే నకిలీ బాబా రఫీని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు నకిలీ బాబా రఫీపై పలు ఆరోపణలు ఉన్నాయి. జనాలను మోసం చేసి రూ.లక్షలు దండుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊళ్లోని దర్గా దగ్గర ఇవన్నీ చేస్తుంటానని.. దెయ్యాలను వదిలిస్తానని చెప్పి చండ్రకోలాతో బాధితులను చితకబాదుతాడని వివరించారు.
"మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. మా బావగారు.. ఈ బాబా పేరు చెప్పారు. ఆయనను సంప్రదిస్తే మా అమ్మాయి కాలుకి కడియం వేసి మళ్లీ వారం రమ్మని చెప్పారు. ఈ మధ్యలో ఆస్పత్రిలో కూడా చూపించాం కానీ దాదాపు రూ. 60 వేల నుంచి 70 వేల బిల్లయింది. తర్వాత బాబాను సంప్రదిస్తే.. ఆయన మా కూతురిని తీసుకురమ్మని చెప్పారు. చేతిలో విబూది పెట్టుకుంటే అది రాస్తున్నారనుకున్నాం. కానీ అంతలోనే మా బిడ్డ కాళ్లు, చేతిని నిప్పుల్లో పెట్టాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాం. మంచి జరగాలని వెళ్తే.. చివరికి మా అమ్మాయిని ఆస్పత్రి పాలు చేశారు."-బాధితురాలి తండ్రి
నకిలీ బాబా రఫీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జబ్బులు నయం చేస్తానని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నాడని చెప్పారు. ఇలాంటి బురిడీ బాబాలను నమ్మొద్దని సూచించారు. ప్రజలంతా నకిలీ బాబాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి:దారుణం.. బాలికపై సోదరుడి అత్యాచారం..!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూజా హోయలు.. ఐశ్వర్యరాయ్ సోయగాలు..