మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలోని చెన్నకేశవస్వామి ఆలయానికి సర్వే నంబర్ 525లో 55.27 ఎకరాల భూమి కేశవస్వామి మారిఫత్ పూజారి కల్యాణచారి పేరిట ఉంది. ధరణి రికార్డుల ప్రకారం అవి దేవాదాయశాఖ భూములుగా, చౌతా ఇనామ్ భూములుగా నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా పూజారుల అధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ సాగుతోంది. ఇటీవల ఈ భూముల్ని అమ్మేశారనే ప్రచారం సాగింది. దాదాపు ఆరు నెలల కిందట యంత్రాలతో ఆ భూముల్ని చదును చేశారు. గతంలో ఆ భూముల నుంచి మట్టిని తరలించడం సైతం వివాదాస్పమైంది. రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో మట్టి తరలింపును నిలిపివేశారు. వాస్తవానికి దేవాదాయశాఖకు సంబంధించిన ఇనాం భూముల్ని అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. అలాంటిది వాటిని ఎలా అమ్ముతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విక్రయించ వీలులేకున్నా..
దేవాదాయ చట్టం, ఇనాం చట్టాల ప్రకారం దేవాలయాల నిర్వహణ కోసం ఇనాంగా పొందిన భూముల్ని ఇనాందారులు వారసత్వంగా అనుభవించేందుకు అవకాశం ఉంది. కానీ విక్రయించేందుకు వీలులేదు. కానీ ప్రస్తుతం చెన్నకేశవస్వామి ఆలయ భూములున్న ప్రాంతం బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.40 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములపై ఓఆర్సీ పొందడం ద్వారా వాటిని అమ్మేందుకు గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు జిల్లా ఉన్నతాధికారుల అండదండలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
చర్యలు తీసుకుంటాం
దేవరకద్ర చెన్నకేశవ ఆలయం సెక్షన్ 43 కింద దేవాదాయశాఖ దస్తాల్ల్రో నమోదు కాలేదు. రెవెన్యూ దస్తాల్ల్రో భూములు దేవాలయం పేరు మీదే ఉన్నాయి. ఈ మధ్య వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌ని ఆదేశించాం. నివేదిక అందిన తరవాత తదుపరి చర్యలు తీసుకుంటాం. దేవాలయానికి ఇనాముగా ఇచ్చిన భూములు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. వాటిని అన్యాక్రాంతం కాకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైన క్షేత్రస్థాయిలో పరిశీలించి బోర్డులు సైతం ఏర్పాటు చేస్తాం.
- శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్, దేవాదాయశాఖ