తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై.. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కాలు, మోచేతికి గాయాలయ్యాయి. ఉదయం విజయవాడలోని నివాసం నుంచి.. పార్టీ కార్యాలయానికి బయల్దేరుతున్న సమయంలో... పట్టాభిపై దుండుగులు దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ఘటనలో పట్టాభి మొబైల్ కూడా ముక్కలైంది. దుండగులు రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారని పట్టాభి తెలిపారు. తనతో పాటు కారు డ్రైవర్‌ను కూడా గాయపరిచారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని.. పట్టాభి స్పష్టం చేశారు. ఆర్నెళ్ల కిందట తన కారుపై దాడి జరిగితే ఇంతవరకు చర్యల్లేవన్న పట్టాభి.. వరుస అరాచాకాలకు డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టాభిపై దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. 15 మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం... పట్టాభిని గాయపర్చడం.... వైకాపా గుండారాజ్‌కు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. సీఎం జగన్ అండతో వైకాపా గుండాలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ దాడి మరో సాక్ష్యమన్నారు. గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై చర్యలు లేవన్న చంద్రబాబు.. పోలీసుల ఉదాసీనతతో దౌర్జన్యాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. అవినీతిని ఆధారాలతో ఎండగడుతున్నారన్న కక్షతోనే.... పట్టాభిని లక్ష్యంగా చేసుకున్నారని.... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైకాపా బెదిరింపులకు అదరం... దాడులకు బెదరబోమని స్పష్టం చేశారు.