Attack on retired Excise SI: నిజామాబాద్‌లో విశ్రాంత ఎక్సైజ్ ఎస్ఐపై ఓ కార్పొరేటర్ భర్త, ఆమె కుమారుడు, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. నగరంలోని ఆర్యనగర్‌లో మద్యం తాగొద్దని అన్నందుకు విశ్రాంత ఎక్సైజ్ ఎస్ఐపై 48వ డివిజన్ కార్పొరేటర్ వనిత భర్త శ్రీనివాస్, అతని కుమారుడు, స్నేహితులు దాడి చేశారు. వినాయక్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ నాయక్ ఆర్యనగర్‌లో కొంతమంది యువకులు రోడ్డుపై మద్యం తాగుతుండగా ప్రశ్నించాడు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగొద్దని వెళ్లిపోవాలని సూచించాడు.
అయితే తాను కార్పొరేటర్ కొడుకునంటూ ఓ యువకుడు చెప్పాడు. వెంటనే తన తండ్రికి సైతం ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న కార్పొరేటర్ భర్త శ్రీనివాస్, కుమారుడు అతని స్నేహితులతో కలిసి లక్ష్మణ్ నాయక్‌పై కర్రలతో దాడి చేశారు. లక్ష్మణ్ నాయక్ తీవ్ర గాయాలతో కింద పడిన తర్వాత వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్, ఇతరులపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.