Attack: పోలీసునని చెప్తున్నా వినకుండా హోంగార్డుపై దాడి - attack on sangareddy constable
13:25 June 10
నోవాపాన్ కూడలిలో బాచుపల్లి హోంగార్డుపై దాడి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నోవాపాన్ కూడలిలో బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ కేసు విషయంలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్ వెళ్లారు. ఈక్రమంలో తాను పోలీస్ అని చెబుతున్నా పట్టించుకోకుండా అతని ఐడీ కార్డు, ఫోన్ విసిరికొట్టి దాడి చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దేవీలాల్‌తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... బాచుపల్లికి చెందిన మారుతీప్రసాద్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతను ఓ ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఆ ఇంట్లో గృహాలంకరణకు సంబంధించి దేవీలాల్‌కు కాంట్రాక్టు ఇచ్చి రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ఈ ఒప్పందం జరిగింది. అందులో కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం దేవీలాల్ పని పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈక్రమంలో మారుతీప్రసాద్ కోర్టు ద్వారా దేవీలాల్‌పై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దేవీలాల్ కోసం గాలించినా అతని చిరునామా తెలియలేదు. దీంతో మారుతీ ప్రసాద్ గురువారం ఉదయం దేవీలాల్ ఉన్న ప్రదేశానికి కానిస్టేబుల్ కనకయ్యను తీసుకెళ్లాడు. దేవీలాల్‌కు నోటీసు ఇచ్చి సంతకం చేయాలని కానిస్టేబుల్ కనకయ్య కోరాగా.. అందుకు తిరస్కరించిన దేవీలాల్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించగా.. దేవీలాల్‌తో పాటు అతని అనుచరులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: బాలయ్యకు ఆ రూమ్ అంటే సెంటిమెంట్!