తెలంగాణ

telangana

ETV Bharat / crime

ATM Theft Gang: ఏటీఎం డిపాజిట్​ మెషీన్లే టార్గెట్​.. నగదు డ్రా చేసుకుని రాలేదంటూ.. - ఏటీఎం డిపాజిట్​ మెషిన్లే టార్గెట్​

ఏటీఎం డిపాజిట్ యంత్రాలే వాళ్లకు కాసుల వర్షం కురిపించే ధనలక్ష్ములు. వాటిలో మాత్రమే నగదును విత్‌డ్రా చేస్తారు. తిరిగి బ్యాంకు అధికారులకు డబ్బులు రాలేదని ఫిర్యాదు చేస్తారు. నిబంధనల ప్రకారం బ్యాంకు అధికారులు తిరిగి వారి ఖాతాల్లో సదరు మొత్తాన్ని జమ చేస్తారు. కానీ.. బ్యాంకు మూల ధన ఖాతాలో మాత్రం డబ్బు ఖాళీ అవుతోంది. ఇదేంటి ఇలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా..? అంతర్రాష్ట్ర హర్యానా ముఠా దగ్గరున్న కిటుకు ఇదే..

atm theft haryana gang arrested in hyderabad
atm theft haryana gang arrested in hyderabad

By

Published : Nov 17, 2021, 4:36 AM IST

హర్యానా ముఠా... ఇప్పుడు ఈ పేరు బ్యాంకు అధికారులకు తలనొప్పిగా మారింది. జంటనగరాల్లోనే కాకండా దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లోని డిపాజిట్‌ యంత్రాలనే లక్ష్యంగా చేసుకొని తెలివిగా సొత్తు తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలో అయిదుగురు చార్మినార్‌ పోలీసులకు చిక్కారు. కేవలం ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రాలనే ముఠా గురి పెడుతోంది. వాటిలోని డిపాజిట్‌ యంత్రాల నుంచే కేటుగాళ్లు నగదు కాజేస్తున్నారు. స్నేహితులు, బంధువులకు చెందిన ఏటీఎం కార్డులను ముఠా సభ్యులు హర్యానా నుంచి తీసుకువస్తారు. ముందుగా హైదరాబాద్‌ చేరుకుని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి... అనే విషయంపై ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏ కేంద్రం నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలో నిర్ణయించుకుని అందుకనుగుణంగా వ్యూహం రచించి పక్కాగా అమలు చేస్తారు.

ఎలా మోసం చేస్తున్నారంటే...

తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డును డిపాజిట్ యంత్రంలో పెడతారు. తమ ఖాతాలో కొంత బ్యాలెన్స్ ఉంచుకుంటారు. సాధారణంగా నగదు ఖాతా నుంచి తీసినట్లుగా ఆపరేట్ చేస్తారు. నగదును డిపాజిట్ మెషిన్​లో జమ చేయడానికి, విత్ డ్రా చేయడానికి ఒకే బాక్స్​లో సదుపాయం ఉంటుంది. ఇదే కేటుగాళ్ళకు ఆసరాగా మారింది. నగదు విత్ డ్రా చేసేందుకు అంతా ఆపరేట్ చేసిన తర్వాత మనం సూచించిన నగదుతో బాక్స్ తెరుచుకుంటుంది. కానీ ఈ నేరగాళ్ళు ఆ బాక్సును పూర్తిగా తెరుచుకోనివ్వకుండా.. మధ్యలోనే చేతితో ఆపేస్తాడు. వెంటనే ఏటీఎంలో విద్యుత్ సరఫరా అవుతున్న స్విచ్ఛ్​ను ఆఫ్‌ చేస్తాడు. మరో వ్యక్తి తెరుచుకున్న కొద్ది సందులో నుంచి నగదును తీసుకుంటాడు. ఎక్కువ సేపు బాక్స్ డోర్ ఆగిపోవడంతో సాంకేతిక సమస్య ఉందని తిరిగి మళ్ళీ లోపలికి వెళ్లిపోతుంది. దీని వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. వాళ్లు మాత్రం ఏమీ ఎరుగనట్టు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేస్తారు. నిబంధనల ప్రకారం బ్యాంకు వారికి డబ్బు సంబంధిత ఖాతాలో జమ చేస్తుంది.

మూలధనంలో తేడా రావటంతో..

ఇలా నల్లకుంట, విద్యానగర్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో ఈ తరహాలో నగదు మూలధనంలో తేడా రావడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాపై నిఘా పెట్టి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ద్విచక్రవాహనం, మూడు ఆటోలు, 11 ఏటీఎం కార్డులు, 5 చరవాణులు, రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎస్‌బీఐ ఏటిఎం కేంద్రాల్లో సరైన భద్రత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలో ఇప్పటివరకు మూడు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నిందితుల కోసం పలు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details