హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల మేనేజర్లు ఏటీఎం సెంటర్ల ద్వారా తమ మూలధన ఖాతాలో డబ్బు పోయిందంటూ వరుస ఫిర్యాదులు ఇచ్చారు. వీటిలో అధికంగా ఆర్బీఎల్ బ్యాంకు ఏటీఎంలలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో నేరగాళ్లు కాజేశారు. డెబిట్ కార్డు ద్వారానే ఏటీఎం యంత్రం నుంచి డబ్బులు విత్ డ్రా జరిగాయి. మూలధన ఖాతాలో తేడాలు రావడంతో బ్యాంకుల అధికారులు తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన పలు లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్‌తో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
ఈ నెల 2న ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలోని ఆర్బీఎల్ బ్యాంకు ఏటీఎంలో మూలధన ఖాతాలో నగదు లెక్కలో తేడాలు వచ్చాయని బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.3.5 లక్షల మేర మోసం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు నగదు విత్ డ్రా చేసే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపేశారని గుర్తించారు. నగదును తీసుకుంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయింది. విత్ డ్రా సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే ఏటీఎంలో సాఫ్ట్‌వేర్‌ను బట్టి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. దీంతో విత్‌డ్రాకు వాడిన డెబిట్ కార్డు సంబంధిత ఖాతాలో తిరిగి నగదు జమ అవుతుంది. ఇలా నగరంలో పలు ఏటీఎంలలో నగదును నేరగాళ్లు దోచేశారు. నెలాఖరులో ఆడిట్ సమయంలో మూలధన ఖాతాల్లో తేడాలు రావడంతో ఈ నేరం బయటపడింది. సనత్‌నగర్ పరిధిలో రూ.7 లక్షలకు పైగా విత్‌డ్రా చేశారు. రాంగోపాల్‌పేట, గచ్చిబౌలి, పంజాగుట్ట, బేగంపేట ఆర్బీఎల్ బ్యాంకు ఏటీఎంలు లక్ష్యంగా హర్యానా, రాజస్థాన్ ముఠాలు చెలరేగిపోయాయి.
ఆ సమయంలోనే పని పూర్తి..: హర్యానా రాష్ట్రం మేవాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ముఠాలు దేశవ్యాప్తంగా ఈ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాత ఏటీఎం యంత్రాలు ఎక్కడ ఉంటే అక్కడ ఈ చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున ఈ నేరాలు ఎక్కువగా జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చెబుతున్నాయి. పంజాగుట్ట, రాంగోపాల్‌పేట, బేగంపేట పరిధిలోని కేసుల్లో ప్రత్యేక బృందాలు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలిస్తున్నాయి.