వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డీసీఎం డ్రైవర్‌పై దాడి చేసి... రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లిన మీర్జా ఆజంను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.70వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన మీర్జా ఆజంపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ 10కేసులున్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు నిందితుడిపై పీడీ చట్టం ప్రయోగించారని... ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని వెల్లడించారు.
జైలుకెళ్లి వచ్చినా చోరీల బాట పట్టాడని పేర్కొన్నారు. ఈ నెల 25న మదనపల్లి నుంచి ఎల్బీనగర్‌కు టమాటా లోడ్‌తో వచ్చిన శ్రీనివాసులు... నేరుగా మార్కెట్ వెళ్లాడని తెలిపారు. అక్కడ టమాటాలు విక్రయించి... రూ.లక్ష నగదును తీసుకొని మదనపల్లి వెళ్తుండగా చింతల్‌కుంట చెక్ పోస్టు వద్ద దాడి చేసినట్లు వెల్లడించారు.