Drug Dealer Stephen Arrested: గోవా నుంచి దేశవ్యాప్తంగా సాగుతోన్న మత్తుదందాకు కారకుడైన సూత్రధారి.. జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్‌ను రాష్ట్ర పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. గోవా బీచ్‌ల్లో మత్తుపదార్థాలు సరఫరా చేసే స్టీఫెన్ గోవాలో హిల్‌టాప్ హోటల్ యజమాని. 1983లో మత్తుపదార్థాలు సరఫరా చేసే ఏజెంట్ నుంచి ప్రస్తుతం దందా చేతిలోకి తీసుకునే స్థాయికి ఎదిగాడని పోలీసులు తెలిపారు.
బడా వ్యాపారులు, రాజకీయ నాయకులకు కోట్లల్లో అప్పులు ఇస్తుంటాడని వివరించారు. ప్రతి శుక్రవారం గోవాలో జరిగే ఫ్రైడే మార్కెట్, గోవా బజార్ పేరుతో విందులు, వినోద కార్యక్రమాలకు స్టీఫెన్ బృందం పర్యాటకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. పెద్దఎత్తున దేశ, విదేశీ పర్యాటకులు వచ్చినపుడు... డీజే పార్టీలు ఏర్పాటు చేయడంతోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేయిస్తాడని పోలీసులు తెలిపారు.
స్టీఫెన్ వద్ద వందలాది ఏజెంట్లు:పకడ్బందీగా మత్తు దందా సాగిస్తున్న స్టీఫెన్ వద్ద వందలాది మంది ఏజెంట్లు ఉన్నారని చెప్పారు. వీరి ద్వారానే గోవాకు వెళ్లే తెలుగురాష్ట్రాల యువకులు డ్రగ్స్‌కు బానిసలు కావడంతోపాటు సబ్ ఏజెంట్లుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 16న ప్రితేష్ నారాయణ బోర్కర్ హబ్సిగూడలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 20 ఎక్స్‌టసీ మాత్రలు, 5 ఎల్ఎస్డీ బోల్ట్స్, 4 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.