తెలంగాణ

telangana

ETV Bharat / crime

జాతీయ రహదారిపై విలేకరులమని నయా దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు - వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్‌

పగలు... రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌-వరంగల్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా వాహనాలను ఆపుతూ విలేకరులమని, పోలీసులకు పట్టిస్తామని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆలేరు పోలీసులు అరెస్టు చేశారు.

Arrest
Arrest

By

Published : Oct 24, 2022, 12:35 PM IST

Updated : Oct 24, 2022, 2:31 PM IST

హైదరాబాదు-వరంగల్‌ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శివారులో వాహనదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని ఆలేరు ఎస్సై ఎం.డి.ఇద్రిస్‌ అలీ ఆదివారం రాత్రి చెప్పారు. జనగామ జిల్లా మైదం చెరువు తండాకు చెందిన ధరావత్‌ అనిల్‌ కుమార్‌, ధనావత్‌ గోపాల్‌ రాత్రి వేళ ఎన్‌హెచ్‌-163 రహదారిపై అర్ధరాత్రి దాటాక, తెల్లవారు జామున గూడ్సు వాహనాలను ఆపుతూ విలేకరులమని, పోలీసులకు పట్టిస్తామని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటాక తేజావత్‌ వీరేందర్‌ అనే వ్యక్తి తన అశోక్‌ లేలాండ్‌ గూడ్సు వాహనంతో హైదరాబాదు వైపు వెళ్తున్న క్రమంలో ఆలేరు సాయిబాబా గుడి సమీపంలో అనిల్‌కుమార్‌, గోపాల్‌ అటకాయించి రూ.10 వేలు వసూలు చేశారు. ఆ వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆలేరు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 24, 2022, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details