ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిమల యాత్ర బస్సు కేరళలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తులు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా కేరళలోని పతనంథిట్ట వద్ద ప్రమాదానికి గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమల వెళ్లారని.. తిరిగి వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం 8 గంటలకు ఒక బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు.
ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని.. పతనంథిట్ట అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఇబ్బంది లేకుండా వైద్యంతో పాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.