తెలంగాణ

telangana

ETV Bharat / crime

Honey Trap: సైనైడ్​తో చంపేస్తుంది.. గుప్త నిధులు, రైస్​ పుల్లింగ్ పేరుతో... - ఏపీ నేర వార్తలు

అమ్మాయిలను ఎరగావేసి.. హానీ ట్రాప్​కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. మోసాలకు పాల్పడుతున్న వారిని ఏపీలోని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రైస్ పుల్లింగ్, గుప్త నిధుల పేరుతో అక్రమాలకు పాల్పడుతూ.. హత్యలు చేసిన ఈ ముఠా ఎట్టకేలకు చిక్కింది.

honey trap
honey trap

By

Published : Sep 21, 2021, 11:27 AM IST

తియ్యని మాటలతో తేలికగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి... అమాయకులను నిండా ముంచడమే కాకుండా తన మాజీ ప్రియుడిని హతమార్చిన ఓ లేడీ కిలాడీ బృందాన్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్.. డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామ శివారులో ఉంటున్న గుడిపాటి సుష్మా అలియాస్‌ సుష్మాచౌదరి సత్రంపాడులో ఓ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. ఈమె భర్త నరేంద్రకుమార్‌ మృతి చెందారు. వీరికి కుమారుడు ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈమె నేరాలకు పాల్పడుతోంది. వంగాయగూడెంలోని సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన వేముల ఉమామహేశ్వరరావు, జంగారెడ్డిగూడెంలో ఉంటున్న వారిగేటి కుమారి, సత్రంపాడులోని ఎంఆర్‌సీ కాలనీకి చెందిన షేక్‌ నాగూర్‌లతో ఓ గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది.

గుట్టుగా అంతమొందించి..

నిందితురాలు తన మాజీ ప్రియుడిని గుట్టుగా సైనైడ్‌తో అంతమొందించింది. గుంటూరుకు చెందిన కావూరి శశిచౌదరిని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత అతను దూరంగా ఉంటూ వచ్చినా... అనేక రకాలుగా వలలో వేసుకోవాలని ప్రయత్నించింది. ఎంతకీ చిక్కకపోవడంతో అంతమొందించాలని భావించింది. జూన్‌ 22న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి అతన్ని పిలిచి, సాంబ్రాణి పుల్లల బూడిదలో సైనైడ్‌ కలిపిన పొట్లాన్ని ఇచ్చింది. దీనిని నీటిలో కలిపి తాగితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్న ఈమె మాటల్ని నమ్మిన అతను అదే రోజు రాత్రి నిద్రించే ముందు తాగి అస్వస్థతకు గురై చనిపోయాడు. కరోనాతో అతను మృతి చెందారని కుటుంబ సభ్యులు భావించారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు పోలీసులు

అనేక రకాల మోసాలతో...

నిందితురాలు సుష్మ తన స్నేహితురాలైన కంటమనేని ధనలక్ష్మి అలియాస్‌ పండుకు ఇటీవల కొంత డబ్బు అప్పుగా ఇచ్చి, ఆమె పొలం కాగితాలను తన పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నించింది. గుప్త నిధులు, మహిమ గల లంకె బిందెలు ఉన్నాయంటూ.. రైస్‌ పుల్లింగ్‌ ద్వారా బాగా డబ్బు వస్తుందంటూ అనేక మందిని మోసగించింది. గంజాయి అక్రమ రవాణాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. అమాయకులను వలలో వేసుకోవడానికి వీడియో కాల్స్‌లో అందంగా కనిపిస్తూ మాట్లాడి, వారిని తమ వద్దకు రప్పించుకోవడం.. తర్వాత డబ్బులు గుంజడం వంటి నేరాలకు ఈ ముఠా పాల్పడింది.

ఇలా.. దొరికారు

ఈ నెల 2న తమకు పరిచయం ఉన్న వ్యక్తిని వీరు ట్రాప్‌ చేశారు. ఓ మహిళతో అతనికి ఫోన్‌ చేయించి ఇంటికి రమ్మని పిలిపించారు. సంబంధిత మహిళ అతన్ని మభ్యపెట్టి దుస్తులు లేకుండా చేసింది. ఆ తరువాత అక్కడే ఇంటి బయట ఉన్న నలుగురు నిందితులు బాధితుడిపై కర్రలతో దాడి చేసి, వీడియోలు తీసి బెదిరించారు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండు చరవాణులు, బంగారు బ్రాస్‌లెట్‌, గొలుసు లాక్కున్నారు. ఆ మరుసటిరోజు రూ.1.50 లక్షలు తీసుకున్నారు. చివరకు బాధితుడు ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించడంతో త్రీటౌన్‌ సీఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాడ తెలుసుకుని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు నగలు, 8 చరవాణులు, రూ.1.50 లక్షల నగదు, ఓ కారు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:heroin case updates : హెరాయిన్ కేసులో సుధాకర్‌ పాత్రధారి.. దిల్లీ వ్యక్తే కీలక సూత్రధారి

ABOUT THE AUTHOR

...view details