కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ శివారులో చోటు చేసుకొంది.
గ్రామ సమీపంలో వరిధాన్యంతో ఉన్న లారీ రోడ్డు పక్కన ఆగిఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపుకు వస్తున్న మరో లారీ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆగి ఉన్న లారీని వెనుకవైపున ఢీ కొట్టినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ విష్ణు... మృతి చెందినట్లు వివరించారు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కమల్, దిల్‌రాజు అనే వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు విష్ణు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించారు.