Honor killing in hyderabad: మార్కెట్ క్రయవిక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ బేగంబజార్‌లో హత్యోదంతం స్థానికులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రేమపెళ్లి చేసుకున్న ఓ యువకుడిని అమ్మాయి కుటుంబీకులు కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. ఇటీవల సరూర్‌నగర్ నాగరాజును నడిరోడ్డుపై అమ్మాయి కుటుంబ సభ్యులు నరికిచంపిన ఘటన మరువకముందే నగరంలో మరొకొటి చోటుచేసుకోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రేమ వివాహం చేసుకున్నందుకే: పెళ్లి అఫ్జల్‌గంజ్ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్నాథ్తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి 50ఏళ్ల క్రితం వలసొచ్చిన వారి కుటుంబం ఇక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్‌టెంపుల్‌లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపగా 'నీరజ్-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.
దారుణంగా హత్య: కొన్ని రోజులుగా నీరజ్ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు. నిన్న రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కులాంతర వివాహం కారణంగానే..:హత్యోదంతం గురించి తెలుసుకున్న షాహినాయత్‌గంజ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితులకోసం గాలింపు చేపట్టారు. ఐదుగురు నిందితులు నీరజ్‌పై దాడిచేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. కులాంతర వివాహం కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.