YCP Group Clashes: ఏపీ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ స్థలం విషయంలో తలెత్తిన ఈ వివాదంలో ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, చిన్నమండెం మండలం మాజీ జెడ్పీటీసీ అనుచరుల మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో వివాదం తలెత్తింది.
రెండు వర్గాలకు చెందిన జనం భారీ సంఖ్యలో చేరుకుని వివాదాస్పద స్థలంలో రాళ్లు పాతడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు కత్తులు, కొడవళ్లు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ వర్గం నాయకుడు రివాల్వర్‌తో హల్‌చల్ చేస్తూ బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసుల ఎదుటే రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఈ గొడవలో ఇరువర్గాలకు చెందిన కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్లలో మారణాయుధాలు బయటపడ్డాయి.