సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మ్యాతరి ఏసు అనే వ్యక్తి కనిపించడం లేదంటూ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులతో కలిసి సొంత తమ్ముడే అన్నను హత్య చేసి పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు రాజు, అతని స్నేహితుడు తలారి నవీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంగారెడ్డి జిల్లా డీఎస్పీ బాలాజీ కేసు వివరాలను వెల్లడించారు.
తాడ్మనూర్ గ్రామానికి చెందిన ఏసు, రాజు అన్నదమ్ములు. వీరికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. అన్న ఏసు పొలం పనులు చూసుకుంటుండగా.. తమ్ముడు రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన రాజు.. ఆస్తిని పంచాలని తరచూ అన్నతో గొడవపడేవాడు. ఆస్తి విషయంలో ఏసు కఠినంగా వ్యవహరించడంతో ఉపాధి కోసం రాజు సంగారెడ్డికి వెళ్లిపోయాడు.
అలా పథకం రచించారు..
అన్న ఉంటే ఆస్తి తనకు దక్కదని భావించిన రాజు.. ఏసును అంతమొందించేందుకు నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితులను సంగారెడ్డికి పిలిపించుకున్నాడు. అన్నను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. పథకం ప్రకారం రాజు, అతని స్నేహితులు నవీన్, అనిల్, బన్నీలతో కలిసి ఆరు బయట పడుకున్న అన్నను బలవంతంగా కారులో ఎక్కించుకొని సంగారెడ్డి జిల్లా జైరాబాద్ సమీపంలోని చించోలి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే ఏసును అంతమొందించి.. గొయ్యి తీసి పాతిపెట్టారు.