తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ అడిగాడు! - engineer murder in bapatla news

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో అదృశ్యమైన ఇంజనీర్ శవమై తేలాడు. డబ్బు కోసం అతని స్నేహితుడే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుడు కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ చెప్పాలంటూ నిందితుడు ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

an engineer was brutally killed by his friend in bapatla guntur district
డబ్బు కోసం.. మిత్రుడే హత్యచేసి పాతిపెట్టాడు

By

Published : Jan 28, 2021, 10:38 PM IST

అడిగిన నగదు ఇవ్వలేదన్న కక్షతో ప్రైవేటు ఇంజినీర్​ను స్నేహితుడే దారుణంగా హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ శివారున జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించటంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విజయవాడ - చెన్నై మూడో రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టు పనులను జీఆర్ ఇన్​ఫ్రా సంస్థ చేస్తోంది. బాపట్ల పట్టణ శివారున కేబీపాలెం రైల్వేగేటు సమీపంలో సదరు సంస్థ ఏర్పాటు చేసిన ర్యాంపులో 150 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, కార్మికులు పని చేస్తున్నారు. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం ఖిలాయికి చెందిన యువరాజ్ విశ్వకర్మ... బాపట్ల - పొన్నూరు ప్రాంతంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల ఇంజినీర్​గా ఆ సంస్థ తరఫున పని చేస్తున్నాడు. పశ్చిమబంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్ డివిజన్ మహిషాస్థలి సమీపంలోని పటామరి గ్రామానికి చెందిన అమర్ మండల్ ఇదే సంస్థలో పంప్ ఆపరేటర్​గా పని చేస్తూ క్యాంపులో ఉంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రెండేళ్లుగా విశ్వకర్మ, అమర్ ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లి రైల్వే ట్రాక్ పనులు పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో వీరద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

మద్యం సేవించి హత్య

యువరాజ్ బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయల నగదు ఉన్న విషయం తెలుసుకున్న మండల్... తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగాడు. దీనికి విశ్వకర్మ నిరాకరించాడు. దీనివల్ల ఇంజినీర్​పై పంప్ ఆపరేటర్ కోపం పెంచుకున్నాడు. అయిదు రోజుల క్రితం ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై పొన్నూరు వెళ్లి నిర్మాణ పనులు పరిశీలించారు. తిరిగి వచ్చేటప్పుడు భక్తిపూడి వద్ద ఓ వైన్​ షాపులో మద్యం సేవించారు. అనంతరం నల్లమడవాగు ఆర్ అండ్ బి వంతెన కిందకు విశ్వకర్మను తీసుకెళ్లిన మండల్... తనకు నగదు ఇవ్వాలంటూ గొడవ పడ్డాడు. దీనికి విశ్వకర్మ నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన మండల్ వెంట తెచ్చుకున్న కత్తితో.... ఇంజనీర్ గొంతు కోశాడు. అనంతరం బాధితుడి పర్సులో నుంచి బ్యాంకు ఏటీఎం కార్డు తీసుకుని కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఇంజినీర్​ను పిన్ నంబరు చెప్పాలని ఒత్తిడి చేశాడు. చెప్పకపోవటంతో కత్తితో మరోసారి దాడి చేశాడు. విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత వంతెన కింద తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టాడు నిందితుడు. మృతుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని ఒకదాన్ని పూడ్చి పెట్టి... మరొక దాన్ని వాగులో పడేశాడు. ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లి పొన్నూరు రైల్వే వంతెన సమీపంలో వదిలి పెట్టి ఏమీ తెలియనట్లుగా అదే రోజు రాత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చాడు.

డబ్బు కోసం.. మిత్రుడే హత్యచేసి పాతిపెట్టాడు

వెలుగులోకి వచ్చింది ఇలా..

యువరాజ్ అదృశ్యంపై జీఆర్ ఇన్​ఫ్రా సంస్థ అధికారి షాజహాన్... 24న రాత్రి బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఇంజనీర్​తో కలిసి పంప్ ఆపరేటర్ అమర్ మండల్ ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్నారు. అనుమానంతో అమర్‌ మండల్​ను సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్పై కిరణ్ అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా యువరాజ్ విశ్వకర్మను హత్య చేసిన విషయాన్ని నిందితుడు తెలియజేశాడు. అతను చెప్పిన వివరాలతో నల్లమడ వాగు వంతెన వద్ద మృతదేహాన్ని బయటకు తీయించారు పోలీసులు. తహసీల్దార్ శ్రీనివాస్ సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. మృతుడి సెల్ ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమర్ మండల్ పై హత్య కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:భద్రాద్రి రామయ్యకు కోటికి పైగా ఆదాయం

ABOUT THE AUTHOR

...view details