సెల్ఫీ వీడియోతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన అక్బర్ బాషా కుటుంబం (akbar basha suicide attempt)చాగలమర్రిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా అక్బర్‌బాషా దంపతులు పురుగుల మందు తాగారు. దీంతో స్థానికులు నలుగురిని చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. అక్బర్‌బాషా కుటుంబం కర్నూలు జిల్లా చాగలమర్రిలో నివసిస్తోంది. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలోని పొలం తగాదా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని గత కొద్దిరోజులుగా అక్బర్‌బాషా కుటుంబం పోరాడుతోంది. ఈ క్రమంలో వారు తమకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమైంది. దీంతో సీఎం కార్యాలయం, కడప ఎస్పీ స్పందించారు. కడప ఎస్పీ అన్బురాజన్ నుంచి సీఎం కార్యాలయం వివరాలను సేకరించింది. అనంతరం బాధిత కుటుంబాన్ని ఎస్పీ పిలిపించడంతో తమకు జరిగిన అన్యాయాన్ని అక్బర్‌బాషా వివరించారు. అక్కడికక్కడే ఎస్పీ అన్బురాజన్ సీఎం కార్యాలయం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్వయంగా సీఎం కార్యాలయం స్పందించడంతో ఈ వివాదానికి ముగింపు పలికిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ క్రమంలో వారు సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
మరోవైపు అక్బర్‌బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే చాగలమర్రి, దువ్వూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితి వాకబు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. అక్బర్‌బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని తేలినట్లు ఎస్పీ చెప్పారు. ఎకరంన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా మైదుకూరు కోర్టు 2018లోనే తీర్పు ఇచ్చిందిని ఎస్పీ తెలిపారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ పై కోర్టుకు వెళ్లేదని, అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ కోర్టులో తేల్చకోవాలని ఆయన సూచించారు. పోలీసులు సివిల్ విషయాల్లో తలదూర్చడం సరికాదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.