కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్ టి, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూరు మండలాలకు మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. మహారాష్ట్రలోని వర్ధా, చంద్రాపుర్, గడ్చిరౌలి జిల్లాలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని మద్యాన్ని కల్తీ చేసి గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు.
తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ మద్యం సరఫరా
పొరుగు రాష్ట్రాల్లో మద్యం నిషేధం.. తెలంగాణలోని మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మద్యం కల్తీ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఆబ్కారీ, టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడుల్లో భారీగా కల్తీ మద్యం పట్టుబడింది.
స్థానిక మద్యం దుకాణాల్లో మద్యం సేకరించి.. దాన్ని కల్తీ చేసి మహారాష్ట్రకు తరలించడమే కాదు.. స్థానికంగా విక్రయిస్తున్నారు. మద్యం కల్తీ చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని గుట్టుగా వ్యవహారం నడుపుతున్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని పోచమ్మ బస్తీలో కాగజ్‌నగర్ డీఎస్పీ బాలస్వామి, ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ సంయుక్తంగా చేపట్టిన దాడిలో కల్తీ మద్యం దొరికింది. కల్తీ చేస్తున్న రాంటెంకి అశోక్‌ను విచారించగా స్థానిక మద్యం దుకాణం నుంచి రవి, తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు తనకు మద్యం కాటన్లు తీసుకువచ్చి ఇస్తారని తాను కల్తీ చేసి తిరిగి వారికి ఇస్తానని తెలిపాడు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.