Adopted son killed Mother: ఈ నెల 7 తెల్లవారుజామున హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని న్యూ గడ్డిఅన్నారంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్య చేయడానికి నిందితుడు ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని... అందులో భాగంగానే సమీపంలో ఉన్న సీసీ కెమెరాల తీగలను తెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దురలవాట్ల బారిన పడిన కుమారుడే తల్లిని చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
కుమారుడి వివాహం కోసం:న్యూ గడ్డి అన్నారంలో నివసించే జంగయ్య యాదవ్, భూదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో 1995లో సమీప బంధువు కుమారుడిని దత్తత తీసుకున్నారు. మూడు రోజుల వయసున్న పసికందును భూదేవి కంటికి రెప్పలా చూసుకొని పెంచి పెద్ద చేసింది. కుమారుడికి సాయితేజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో బాగా చదివించారు. ఇటీవల సాయితేజ వివాహానికి తండ్రి జంగయ్య సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఖర్చులు, కాబోయే కోడలి కోసం రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం ఇంట్లో సిద్ధంగా ఉంచాడు.
అంతా సవ్యంగా జరుగుతుందనే లోపల అనుకోని ఘటనలు ఆయనను కలవరపాటుకు గురిచేశాయి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న దత్త కుమారుడు.. చెడు అలవాట్లకు బానిసయ్యాడని తెలిసి కుంగిపోయాడు. తీరు మార్చుకోవాలని పలుమార్లు నచ్చజెప్పినా సాయి తేజ వినలేదు. పెళ్లి చేస్తే మారతాడులే అనుకుని సర్ది చెప్పుకొన్నారు. కానీ కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచినందుకు ఇలా తన భార్య ఉసురు తీసుకుంటాడని ఊహించుకోలేకపోయారు.