తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఛత్తీస్​గఢ్‌లో విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన తెలంగాణ విద్యార్థిని - Raipur Collage issue

girl dies after dance in Rajkumar College: డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ... ఛత్తీస్​గఢ్​లో ఓ తెలంగాణ విద్యార్థిని ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాయపూర్‌లోని రాజ్‌కుమార్‌ కళాశాలలో చదువు కుంటున్న ఆదిలాబాద్ విద్యార్థిని ఆకస్మాత్తుగా సృహతప్పి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

During the dance rehearsal in Rajkumar College Raipur
During the dance rehearsal in Rajkumar College Raipur

By

Published : Dec 8, 2022, 10:33 PM IST

girl dies after dance in Rajkumar College: ఛత్తీస్​గఢ్ రాజధాని రాయపూర్​లోని రాజ్‌కుమార్ కాలేజీలో ఆదిలాబాద్​కు చెందిన 12 సంవత్సరాల బాలిక మరణించింది. గత మంగళవారం డ్యాన్స్ రిహార్సల్ జరుగుతున్న సమయంలో విద్యార్థిని ఆరోగ్యం క్షీణించింది. ఒక్కసారిగా సృహతప్పి పడిపోవడంతో కళాశాల వైద్యుడు పరిశీలించి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక రామకృష్ణ ఆసుపత్రిలో చేర్పించగా... బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం విద్యార్థిని చనిపోగా గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.

రాయపూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజ్

స్కూల్ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం... బాలిక రాత్రి భోజనం చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ రిహార్సల్ కోసం వచ్చింది. ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి పడిపోయిందని తెలిపారు. అటు ఆసుపత్రి వర్గాలు తమ వద్దకు వచ్చేసరికి బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందని తెలిపారు. వెంటనే వెంటిలేటర్‌ అమర్చి చికిత్స ప్రారంభించినా... ఫలితం లేకపోయిందని తెలిపారు.

''ఈ వ్యవహారంపై రాజ్‌కుమార్ కళాశాల యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం రాత్రి 8:45 గంటల ప్రాంతంలో డ్యాన్స్‌ రిహార్సల్‌ సమయంలో బాలిక స్పృహతప్పి వేదికపై పడిపోయింది. ఆమెను స్కూల్ రామకృష్ణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక చికిత్స పొందుతూనే మరణించింది. వ్యక్తిగత గోపత్య దృష్ట్యా మేము మృతురాలి పేరు, తరగతి వివరాలు వెల్లడించలేము.'' - రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అవినాష్‌ సింగ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌

సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదిలాబాద్​కు తీసుకొచ్చారు. స్థానిక ఆజాద్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్​మార్టం నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి గాయపడి చనిపోయిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోస్ట్​మార్టం నివేదిక వచ్చాకే ఈ విషయంలో స్పష్టత రానుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details