ACP Illegal Land Corruption: బాధితుల పక్షాన నిలవాల్సిన ఓ పోలీసు అధికారి.. కబ్జాదారుతో చేతులు కలిపాడు. ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన రూ.60 కోట్ల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టడం కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీ రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. కబ్జాదారు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండగా.. దానికి కొంత సమయం పట్టేట్టుంది. అతడికి ఆ పని పూర్తయ్యేలోగా ఆ జాగాలో యజమాని అయిన ఎన్‌ఆర్‌ఐను అడుగుపెట్టకుండా ఏసీపీ చూడాలన్నది ఈ డీల్ సారాంశం. చివరికి ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది.
9.14 ఎకరాలు అప్పగించే యత్నం:ఆ ఎన్‌ఆర్‌ఐకి రాచకొండ పరిధిలోని ఓ ప్రాంతంలో 9.14 ఎకరాల భూమి ఉంది. రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేశారు. ఈ భూమిపై ఎన్నాళ్లుగానో కన్నేసిన ఓ వ్యక్తి.. అక్కడ బౌన్సర్లను పెట్టాడు. అదేంటని ఎన్‌ఆర్‌ఐ ప్రశ్నిస్తే ఆ భూమి తమదేనంటూ దబాయించాడు. కబ్జాకు సహకరించాలని అక్కడ ఏసీపీని సంప్రదించాడు. ఆ భూమిలో ఎన్‌ఆర్‌ఐ అడుగుపెట్టకుండా చూసేందుకు రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.
ఇంతలో ఈ కబ్జా ప్రయత్నంపై ఆ ఏసీపీనే కలిసి ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు చేయగా.. కబ్జాదారును ఆ భూమి దరిదాపుల్లో లేకుండా చేస్తానని ఇక ఆ భూమి జోలికి అతడు రాడని చెప్పి నమ్మించి రూ.5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. వివిధ వర్గాల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలిసి అంతర్గత దర్యాప్తు చేయించగా అంతా వాస్తవమేనని తేలడంతో వారు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. దాంతో కబ్జాదారు, అతడి బౌన్సర్లు ఎవరూ అక్కడ లేకుండా ఏసీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.