Police attack on congress ward member: నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల దాష్టీకం తారాస్థాయికి చేరింది. అచ్చంపేట మండలం చెదురు బావి తండాకు చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు మాతృనాయక్పై ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని బాధితుడి బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. హోలీ పండుగ రోజు రోడ్డుపై తన దారిన తాను వెళ్తుండగా అడ్డగించి మరీ.. పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లి కొట్టారని బాధితుడు వాపోయారు. తాను ఎంత బతిమిలాడుతున్నా కరుణించలేదని పేర్కొన్నారు. దాహంగా ఉంది.. మంచినీళ్లు ఇవ్వండని అడిగినా కనికరం చూపలేదని విలపించారు. లాఠీతో విచక్షణారహితంగా దాడి చేశారని పేర్కొన్నారు. తెరాసలోకి వెళ్తే రూ. 10 లక్షలు ఇప్పిస్తా.. కాంగ్రెస్‌ను విడిచి తెరాసలో చేరమని బెదిరించారని చెప్పారు. కాదన్నందుకు మళ్లీ దాడికి పాల్పడ్డారని వివరించారు. అనంతరం బయటకు వచ్చాక.. అవమానం, పోలీసుల దౌర్జన్యం భరించలేక పోలీస్ స్టేషన్ ఎదుటే మాతృనాయక్ ఆత్మహత్యకు యత్నించాడు.
అసలేం జరిగింది...
"హోలీ పండుగరోజు మా బంధువును దింపడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. నేను అక్కడినుంచి వెళ్లిపోయాను. మా బంధువును దింపి.. తిరిగి వస్తుండగా ఎస్సై ప్రదీప్ నాయక్, ఏఎస్సై అంజయ్య, కానిస్టేబుల్ రాంబాబు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ నాపై విపరీతంగా దాడికి పాల్పడ్డారు. దెబ్బలు తాళలేక చచ్చిపోతున్నా అన్నా కూడా ఊరుకోలేదు. దాహమేస్తుంది మంచి నీళ్లు ఇవ్వమన్నా.. కనికరించలేదు. నన్ను తెరాస కార్యకర్తగా చెప్ఫుకోమంటున్నారు. అధికార పార్టీలో చేరితే రూ. 10 లక్షలు ఇప్పిస్తా అంటున్నారు. కానిస్టేబుల్ మాటలకూ ఎస్సై వంతపాడారు. నేను చస్తే ఒప్పుకోనని చెప్పేసా."-మాతృనాయక్, కాంగ్రెస్ వార్డు మెంబర్